జీహెచ్‌ఎంసీ ఎన్నికలు – నవంబర్‌ రెండో వారంలో షెడ్యూల్‌ కసరత్తు చేస్తున్న ప్రభుత్వం – డిసెంబర్‌ మూడో వారంలో ఎన్నికలు

0
218

శేరిలింగంపల్లి, అక్టోబర్ 30: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల ప్రక్రియలో మళ్లీ కదలిక మొదలైంది. తాజా ప్రతిపాదనల మేరకు నవంబర్‌ రెండో వారంలో షెడ్యూల్‌ విడుదల చేసి డిసెంబర్‌ మూడో వారంలో ఎన్నికలు నిర్వహించే దిశ గా కసరత్తు వేగం పుంజుకుంది. తొలుత డిసెంబర్‌లో ఎన్నికలు నిర్వహిస్తారని భావించిన ప్పటికీ ఇటీవలి వర్షాలు, వరదలతో.. జనవరి ఆఖరు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఉం డొచ్చని భావించారు. కానీ మళ్లీ ప్రభుత్వం నుంచి వచ్చిన సంకేతాలతో.. జోనల్, సర్కిల్‌ కార్యాలయాల్లో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వీలైనంత వేగిరం చేసి, ఆపై ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నగరంలో వరద బాధిత కుటుంబాలకు పంపిణీ చేస్తున్న రూ.10 వేల సాయాన్ని ఈ నెల 31లోగా పూర్తి చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలిచ్చిం ది. డబుల్‌ బెడ్రూం ఇళ్ల పంపిణీ, రహదారుల మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశిస్తూ.. ఎన్నికల షెడ్యూల్‌ ఎప్పుడైనా వెలువడవచ్చనే సంకేతాలిచ్చింది.

పాత రిజర్వేషన్లే ఇప్పుడూ..
జీహెచ్‌ఎంసీ చట్టానికి ఇటీవల చేసిన సవరణ మేరకు ప్రస్తుతం ఉన్న డివిజన్ల రిజర్వేషన్లను యథావిధిగా కొనసాగించనున్నారు. అలాగే మహిళలకు 2016లో అమలైన 50 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత లభించింది. ఈ మేరకు 150 డివిజన్లలో 75 పూర్తిగా మహిళలకే కేటాయిస్తారు. ఈ మారు మేయర్‌ పీఠం కూడా వారికే కేటాయించారు. దీంతో జీహెచ్‌ఎంసీ లో మహిళా నేతల సందడి మరింత పెరగనుంది. కాగా, 2020 ఫిబ్రవరి ఓటర్ల జాబితానే ప్రామాణికంగానే తీసుకుని, కొత్త ఓటర్ల నమోదుకు నామినేషన్ల ముందురోజు వరకు అనుమతించనున్నారు. ప్రస్తుత పాలకవర్గం గడువు 2021 ఫిబ్రవరి 10 వరకు ఉన్నా, 3 నెలల ముందుగానే ఎన్నికలకు వెళ్లి, కొత్త పాలకవర్గం కొలువుదీరేందుకు తాజా సవరణలు అనుమతిస్తున్నాయి. అంతా సవ్యంగా సాగితే జీహెచ్‌ఎంసీ కొత్త పాలకవర్గం 45 రోజుల ముందుగానే కొలువుదీరనుంది.

రిటర్నింగ్‌ అధికారుల నియామకం

బల్దియా ఎన్నికలకు అడుగులు వడివడిగా పడుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్‌ అధికారులు (ఆర్‌ఓ), అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులను (ఏఆర్‌ఓ) నియమించారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ పంపిన జాబితాను ఆమోదిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. గ్రేటర్‌ పరిధిలోని 30 సర్కిళ్ల వారీగా 150 వార్డులకు ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలతోపాటు రిజర్వులో ఉండేందుకు కూడా అధికారులను నియమించారు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here