వలస కార్మికులను తమ సొంత రాష్ట్రాలకు పంపించేందుకు మంగళవారం నుంచి వారం రోజుల పాటు ప్రత్యేక రైళ్లు: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.

0
198

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వలస కార్మికులను తమ సొంత రాష్ట్రాలకు పంపించేందుకు మంగళవారం నుంచి వారం రోజుల పాటు రోజుకు 40 చొప్పున ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు.

హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు వరంగల్, ఖమ్మం, రామగుండం, దామరచర్ల తదితర ప్రాంతాల నుంచి కూడా రైళ్లు నడపనున్నట్లు వెల్లడించారు. బీహార్, ఒడిస్సా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలకు రైళ్లు నడుపుతామని తెలిపారు. లాక్ డౌన్ వల్ల వలస కార్మికులు పడుతున్న ఇబ్బందులపై సోమవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న వలస కార్మికులు తమ సొంత ప్రాంతాలకు వెళ్ళేందుకు ఆసక్తి చూపుతుండడంపై చర్చ జరిగింది. తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రత్యేక రైళ్లు నడిపి కార్మికులను తమ స్వస్థలాలకు చేర్చాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నిర్ణయించారు.

దక్షిణ మధ్య రైల్వే జిఎం గజానన్ మాల్యతో మాట్లాడి, మంగళవారం నుంచి 40 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు.

కార్మికులను తమ సొంత రాష్ట్రాలకు రైళ్ల ద్వారా తరలించే కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు సీనియర్ ఐఎఎస్ అధికారి సందీప్ సుల్తానియా, సీనియర్ ఐపిఎస్ అధికారి జితేందర్ రెడ్డిలను ప్రభుత్వం ప్రత్యేకాధికారులుగా నియమించింది.

తమ సొంత స్థలాలకు వెళ్ళేందుకు వివిధ పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే కార్మికులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అలా పేర్లు నమోదు చేసుకున్న వారిని రైళ్ల ద్వారా తరలిస్తారు. పోలీస్ స్టేషన్లలోనే వివరాలు ఇస్తారు. తెలంగాణ ప్రభుత్వం కార్మికులను తమ సొంత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినందున ఎవరూ ఆందోళన చెందవద్దని ముఖ్యమంత్రి కోరారు.

ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లను వివరించి, కార్మికులను సమన్వయం చేయాల్సిందిగా పోలీసు అధికారులను ముఖ్యమంత్రి కోరారు.

Nalla Sanjeeva Reddy
Telangana State
Bureau Chief & Incharge South India,
NAC NEWS CHANNEL.